Menu


ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదిగిన మహిళా శక్తిని గుర్తించకపోతే ఏ దేశం ముందుకు నడవ లేదని ఎన్నో ఉదహారణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మాటలలో మహిళా శక్తిని నిర్వచించాలి అంటే ‘మహిళా సాధికారికత ఒక మంచి దేశ అభివృద్ధికి, పునర్నిర్మాణానికి ఎంతో అవసరం. సమాజ అభివృద్ధి మహిళల అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది’ అని అంటారు అబ్దుల్ కలామ్. ఒక దేశం మంచి దేశంగా అభివృద్ధి చెందాలి అంటే మంచి సమాజం కావాలి అటువంటి సమాజం రావాలి అంటే మంచికుటుంబాలు దేశం అంతా ఏర్పడాలి.

అటువంటి కుటుంబాలు ఏర్పడాలి అంటే అన్ని రంగాలలో మహిళల అభివృద్ధి జరిగితేనే మంచి కుటుంబాలు ఏర్పడుతాయి. ఈమధ్యనే మన భారత దేశానికి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ దేశాలు అభివృద్ధి చెందాలి అంటే మహిళలు అభివృద్ధి చెందితేనే సాధ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఒబామా. ఒక అమ్మాయి స్కూల్ కు వెళ్ళి చదువు కోవడం వల్ల కేవలం ఆమెకు వచ్చే జ్ఞానం ఆమెకు మాత్రమే పరిమితం కాకుండా ఆమె ద్వారా ఆమె కుటుంబానికి అదే విధంగా సమాజానికి మేలు జరుగు తుంది.

అందువల్లనే అభివృద్ధి చెందిన దేశాలలో స్త్రీల విధ్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతదేశ జనాభాలో సగభాగం వరకు ఉన్న మహిళలకు నిజంగా ఇంత ప్రాధాన్యత లభిస్తోందా అంటే ఈరోజుకీ సమాధానం లేని ప్రశ్న. ఈదేశాన్ని ఒక మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినా మన దేశంలో ఇప్పటికీ రోజుకు వేల సంఖ్యలో స్త్రీల పై అత్యాచార సంఘటనలు, వేధింపులకు సంబంధించిన కంప్లైంట్స్ దేశ వ్యాప్తంగా పోలీసు స్టేషన్స్ లో నమోదు అవుతున్నాయి.

పార్లమెంట్ లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వద్దామని ఎంతో ప్రయత్నించినా ఆ బిల్లు కాగితాలను చిత్తు కాగితాలులా విసిరేస్తూ సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా గతంలో జరిగిన రగడ దృశ్యాలు గుర్తుకు వస్తే మన దేశంలో ఇంకా ఎన్ని మహిళా దినోత్సవాలు జరిగినా మరిన్ని సంస్కరణలు చేపట్టినా పురుషాధిక్య సమాజంలో మహిళ ఇంకా స్వేఛ్చ కోసం పోరాడుతూనే ఉన్నది అన్నది వాస్తవం.

source:http://www.apherald.com/Politics/ViewArticle/80915/INTERNATIONAL-WOMENS-DAY-SYMBOL-FOR-VICTORY/

0 comments:

Post a Comment

 
Top