మానవత్వం
మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వం మితిమీరితే మనిషి
రోడ్డున పడతాడు. అచ్చం మన హీరో హాస్యనట చక్రవర్తి రాజబాబులా
ఒక సినిమాలో
హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావలసిందే అని పట్టుపట్టాడు
రాజబాబు. ఎన్టీఆర్ హీరో మీరు కమెడియన్ అని నిర్మాత నసిగితే.. ఐతే హీరోనే కమెడియన్‌గా
చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారు. ఈ విషయం ఓ
సందర్భంలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు స్వయంగా చెప్పారు. జగపతి వారి అంతస్తులు
సినిమాలో నటించినందుకు 13వందల రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే రాజబాబు
తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం
తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి రాజబాబు సినీ జీవితంలో. గంటల చొప్పున నటించిన
నటుడు. ఒక గంట ఎన్టీఆర్‌తో నటిస్తే, మరో గంట శోభన్‌బాబు సినిమాలో ఇతరుల సినిమాల్లో నటించిన రికార్డు రాజబాబుది.
డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేంత బిజీగా
మారిపోయాడు.
ఒకప్పుడు
మద్రాస్‌లో పంపునీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు కమెడియన్ గా హీరోను మించిన
పాపులారిటీ సంపాదించారు,
డబ్బు
సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు. అగ్ర హీరోల
పారితోషికం కూడా ఆ కాలంలో అంతే.
బహుశా
వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నవారే హాస్యనటులుగా రాణిస్తారేమో!
చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతో మంది హాస్యనటులు వ్యక్తిగత జీవితంలో
ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఏమీ లేని కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు, ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న తరువాత కూడా
కష్టాలు ఆయన్ని వీడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకుని రాజబాబును వెంబడించాయి.
తన పుట్టిన రోజు నాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. బాలకృష్ణ (పాతాళభైరవి
అంజిగాడు) తో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి
వేదికపైనే బోరున ఏడ్చేశారు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యల మయమే.
కానీ తాను మాత్రం కోట్ల మంది ప్రేక్షకులకు చక్కని హాస్యం అందించారు, కడుపుబ్బా నవ్వించారు.
తుఫాను
వస్తే జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు నటులున్నారు. రాజకీయ ప్రవేశానికి
వారికి ఆ జోలె ఉపయోగపడింది. రాజబాబు అలా కాదు.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు
విరాళాలు సేకరించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అందజేశారు. రాజబాబు పేదలకు
ఏకంగా ఒక కాలనీ కట్టి ఇచ్చారు. రాజమండ్రిలో పాకిపనివారి దుస్థితి చూసిన ఆయనలోని
మనిషి కదిలిపోయి వారి కోసం ఏకంగా కాలనీ కట్టించారు. తెలుగునాట బహుశా ఏ మహానటుడు
కూడా ఇలా చేసి ఉండరు. రాజమండ్రిలో ఏకంగా ఒక జూనియర్ కాలేజీని కూడా కట్టించారు.
1937 అక్టోబర్ 20న తూర్పు గోదావరి జిల్లాలో ఉమా మహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు ఇంటర్
మీడియట్ చదివి, తెలుగు టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. రాజబాబు
అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దాన
ధర్మాలు చేశారు. దాని వల్ల వచ్చే జన్మకోసం ఆయన ఎంత పుణ్యం మూట కట్టుకున్నారో
తెలియదు కానీ కష్టాల్లోనే కడతేరారు. ఎంతో మందికి సహాయం చేశారు. పేదలకు పెళ్లిళ్లు
చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ
గుర్తుంచుకొని వారికి సహాయం చేశారు. వేషాల కోసం మద్రాస్‌లో తిరుగుతున్నప్పుడు ఆకలి
గుర్తించి అన్నం పెట్టిన రాజసులోచన తోటమాలిని సైతం ఎదిగిన తరువాత గుర్తుంచుకుని
ఆదరించిన మానవత్వం ఆయనది. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించారు. వరుసగా 13 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన రికార్డు
రాజబాబుదే.
సినిమాలో
రాజబాబు ఉన్నాడా? లేడా? అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే పరిస్థితి ఏర్పడింది. రాజబాబు ఉంటేనే
సినిమాకు కాసులు రాలుతాయని వారు నమ్మారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఎన్నో
సినిమాలు రాజబాబు వల్ల విజయవంతం అయ్యాయి. నిర్మాతలు బాగుపడ్డారు. ముందు చూపు
లేకపోవడంతో చివరకు తన వారికి కీర్తిని తప్ప ఏమీ మిగల్చకుండానే వెళ్లిపోయారు.
తాతా మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే, తాతా మనవడు సినిమాల్లో హీరోగా నటించి, మెప్పించారు. నటనా ప్రతిభా ఉన్నా అవకాశాలు
అంత ఈజీగా దొరకలేదు. దాంతో పొట్టపోసుకోవడానికి ట్యూషన్లను నమ్ముకున్నారు. అడ్డాల
నారాయణరావు తీసిన సమాజం సినిమాలో హాస్యనటునిగా తొలి అవకాశం లభించింది. ఆ తరువాత
అవకాశాల ప్రవాహం మొదలైంది.
హాస్యనటుడు
అయినా రాజబాబు మాటల్లో తాత్విక ధోరణి ఎక్కువగా ఉండేదంటారు. రాజబాబు నుంచి ప్రజలు
హాస్యాన్ని కోరుకుంటారు. కానీ రాజబాబు మాత్రం ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని
ప్రయత్నించారు. మనిషి రోడ్డున పడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలు నిర్మించారు.
సినిమా అద్భుతంగా ఉంది. మంచి సందేశం ఉంది కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేక్షకులు
మెచ్చే దారిలోనే నిర్మాత వెళ్లాలి అనే సందేశం రాజబాబు లాంటి వారికి ఈ సినిమా
ఇచ్చింది. కానీ ఈ అనుభవం రాజబాబుకు ఆర్థికంగా బాగానే భారం అయింది.
***
పనీ పనీ పనీ
రాజబాబుకు తెలిసింది ఇదొక్కటే. భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది, ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడింది అని ఆయనతో
దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ ఓ
సందర్భంలో తెలిపారు. కుటుంబ కలహాలు సున్నిత మనస్కుడైన రాజబాబుపై తీవ్రమైన ప్రభావం
చూపించాయి. రాజబాబు మద్యానికి బానిసయ్యారు. సినిమాలు లేక మద్యాన్ని నమ్ముకున్నాను
అనేది రాజబాబు చెప్పిన మాట, మద్యానికి బానిస అయ్యారు కాబట్టి అవకాశాలు ఇవ్వలేదు అనేది సినిమా వారి మాట.
ఎవరి మాటల్లో ఎంత నిజముందో కానీ రాజబాబు మాత్రం విషాదంగానే ముగిసిపోయింది. కేవలం 45 ఏళ్ల వయసు. సినిమా రంగంలో ఉన్న కొందరి
వ్యసనాలు బయట పడతాయి,
కొందరివి
రహస్యంగా ఉండిపోతాయి. అంతే తేడా..
1960లో మద్రాసుకు వచ్చి సినిమా యాత్రను
ప్రారంభించిన రాజబాబు దాదాపు 20 ఏళ్లపాటు సినిమా సామాజ్య్రంలో నట చక్రవర్తిగా జీవించి ఏమీ లేకుండానే ఖాళీ
చేతులతోనే జీవితం ముగించారు. 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని అస్పత్రిలో తుది శ్వాస
విడిచారు. అంతకు ముందు రోజే మాట్లాడాలని ఉంది వస్తావా? అని రమాప్రభకు ఫోన్ చేశారు. అమె రాకముందే, చివరకు ఆ చిన్న కోరిక కూడా తీరకుండానే కన్ను
మూశారు. రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా రాజబాబు కుటుంబం ఇక్కడకు
వచ్చి రాజబాబు జయంతి,
వర్థంతి
నిర్వహిస్తుంది. జీవితాన్ని ఎక్కడ ప్రారంభించారో మళ్లీ అక్కడికే చేరుకున్నారు.
మరణించే నాటికి రాజబాబు వయసు 45 సంవత్సరాలు. చివరి సినిమా గడసరి అత్త సొగసరి కోడలు. 1965లో లక్ష్మీ అమ్ములుతో రాజబాబు వివాహం
జరిగింది. అమె మహాకవి శ్రీశ్రీ మరదలు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్ సినిమాల్లో నటిస్తున్నారు. రాజబాబు
ఇద్దరు కుమారులు నాగేంద్ర బాబు, మహేశ్‌బాబు అమెరికాలో ఉన్నారు.
***
కష్టాలతో
కాలం గడుపుతున్న రోజుల్లో రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తన
ప్రయోజకత్వాన్ని తల్లికి చూపాలనుకొన్నారు .. రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే తల్లి
కన్ను మూశారు .. రాజబాబు కుమారులు ఎదిగి అమెరికాలో సొంత ఐ టి కంపెనీ నడుపుతున్నారు
.. వారి ప్రయోజకత్వాన్ని చూడకుండానే పిన్న వయసులోనే రాజబాబుతనువు చా లించారు . .
source@andhra bhoomi
http://stovid.com/telugu/హాస్యనట-చక్రవర్తి-రాజబాబ/318