మెగా కుటుంబం నుంచి మరో హీరోగా పరిచయం అవుతున్న మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముకుంద'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పాట మినహా పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ నేపధ్యంలో బిజినెస్ మొదలైంది. అయితే బయ్యర్లు కొనటానికి భయపడుతున్నట్లు ట్రేడ్ లో వినపడుతోంది. దానికి కారణం...పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. పవన్ చిత్రం గోపాల గోపాల ని సైతం సంక్రాంతికే విడుదల చేయనుండటంతో ఆ ఎఫెక్టు తమ చిత్రం కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందంటున్నారు. మరో ప్రక్క థియోటర్స్ ని సైతం ఈ రెండు సినిమాలే పంచుకోనున్నాయి. ఇక ప్రేక్షకులు పవన్ సినిమాకు మొదట ప్రయారిటీ ఇస్తారని, హిట్ టాక్ వచ్చాక...ముకుందాని చూద్దామనుకుంటారని చెప్పుకుంటున్నారు. అయితే మెగాభిమానలు మాత్రం అటువంటిదేమీ ఉండదు..ఏ సినిమా ప్రత్యేకత దానిదే. రెండూ చూస్తామంటున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ముకుందా చిత్రంలో రూరల్ టౌన్‌లో జరిగే ప్రేమకథలు, అక్కడి రాజకీయాలు, దాని కారణంగా అక్కడవుండే కుర్రాళ్ల భావోద్వేగాల ఇతివృత్తంతో చిత్రం రూపొందింది. ముకుందా చిత్రం లో పాటని త్వరలోనే హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకు రెండు మంచి కుటుంబ కథా చిత్రాల్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, డిసెంబర్ 14న పాటలని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. గోపాల గోపాల విషయానికి వస్తే... తెలుగులో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఇది. వెంకటేష్, పవన్‌కళ్యాణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ‘తడాఖా' ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన పనులన్నీ వేగవంతం చేశారు. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదలకానుంది. ఆడియోను డిసెంబర్‌లో విడుదల చేయడాలని సన్నాహాలు చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా శ్రేయ నటిస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయని నిర్మాతలు తెలిపారు. వెంకటేష్, పవన్‌కళ్యాణ్ కలిసి నటిస్తుండటంతో ఇద్దరి అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.
source: http://telugu.filmibeat.com/box-office/mukunda-buyers-afraid-pawan-s-presence-042178.html
0 comments:
Post a Comment