Menu



బాపు రామాలయంలో, విశ్వనాథ్ శివాలయంలో పూజారులుగా ఉండాల్సినవారని మహాకవి శ్రీశ్రీ మాటలు కొంత అతిగా అనిపించినప్పటికీ ఆయన మాటల్లోని లోతులను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. బాపు సంపూర్ణ రామాయణం, శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాల్లో సీతారాముల అనుబంధాన్ని అత్యంత అత్మీయంగా చిత్రీకరించారు. నిజానికి, వాల్మీకి రామాయణంలోని ఇతివృత్తాలను, సారాంశాన్ని సాంఘిక చిత్రాల నిర్మాణానికి ఆయన వాడుకున్న తీరు అనిర్వచనీయమైంది, అనన్య సామాన్యమైంది కూడా. 

ముత్యాలముగ్గు సినిమా ఆయన రామాయణ కథా ఇతివృత్తాన్ని తీసుకుని రూపొందించిన అద్భుతమైన సాంఘిక దృశ్యకావ్యం. అందులోని రావణుడి పాత్రను పోలే రావు గోపాలరావు పాత్రను ఎన్నటికీ మరిచిపోలేరు. బాపు మలిచిన ఆ రావు గోపాలరావు రూపానికి ముళ్లపూడి వెంకటరమణ అందించిన సంభాషణలు అవసరమైన చోట ఉటంకిపులుగా పనికి వస్తాయి. మనషన్నవాడికి కాస్తా కళాపోసణ ఉండాలి అని రావుగోపాలరావుతో అనిపించిన డైలాగ్ ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నది.

 ఇక మిస్టర్ పెళ్లాం చిత్రం ఇతివృత్తం ఆధునిక జీవనవిధానాన్ని స్వీకరిస్తూనే దాంపత్యం స్వచ్ఛంగా, అమలినంగా ఎలా ఉండవచ్చునో బాపు చూపించారు. అందాల రాముడు సినిమా గురించి చెప్పనే అక్కర్లేదు. బాపు సినిమాల్లో కొన్ని ఫ్లాట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి ఆధునిక జీవితంలోని వెర్రితలల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ఇక, బాపు ఎంపిక చేసుకునే కథానాయికలకు బాపు బొమ్మలుగా పేరు పడడం ఆయన శైలికి, ప్రత్యేకతకు నిదర్శనం. కథానాయికలతో ఆయన కళ్లతో మాట్లాడించే పద్ధతి అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. సోగ కళ్ల భామలను, విశాలాక్షులను ఆయన కథానాయికలను ఎన్నుకుని అందమంతా ఆ కళ్లలోనే ఉందన్నట్లుగా చూపించారు.

మనవూరి పాండవులు కూడా రామాయణ ఇతివృత్తాన్నే ఆధునిక కాలంలోని సామాజానికి అన్వయం చేస్తుంది. ఇందులో కృష్ణంరాజు చేత చేయించిన నటన ఎన్నటికీ మరిచిపోలేనిది. భక్త కన్నప్పఅలో కూడా కృష్ణంరాజు చేత సంభాషణలు చెప్పించిన తీరు చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణంరాజు చేత మళ్లీ అటువంటి నటనను దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కటకటాల రుద్రయ్యలో చూస్తాం. ఆగ్రహావేశంలో కూడా చాలా నెమ్మదిగా కృష్ణంరాజు చేత మాట్లాడించడం ద్వారా అద్భుతమైన ఎఫెక్ట్‌ను తీసుకు రాగలిగారు.

సాక్షి సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. అది సినిమాలకు సంబంధించి ఓ నమూనాగా నిలుస్తుంది. కృష్ణతో అమాయకుడిగా నటింపజేసిన తీరు అద్భుతం. ఏ నటుడి చేత ఎలా నటింపజేయాలో, వారి లోపాలూ గుణాలూ ఏమిటో తెలిసిన గొప్ప దర్శకుడిగా బాపు కనిపిస్తారు. అందువల్ల ఆయన సినిమాల్లోని నటుల ప్రతిభను అతి గొప్పగా వాడుకున్న దర్శకుడు బాపు. బాపు నుంచి ఇప్పటి దర్శకులు నేర్చుకోవాల్సిన పలు విషయాల్లో ఇది అత్యంత ప్రధానమైంది.

ఇక, బుడుగు కొంటెతనం గురించి చెప్పనే అవసరం లేదు. ప్రతి తెలుగువారి ఇళ్లలో అటువంటి బుడుగు ఒకడు తప్పకుండా ఉంటాడు లేదా బాపు బుడుగే మన ఇంట్లోకి వచ్చి సందడి చేస్తుంటాడు అనేంతగా ఆకట్టుకుంది. జాతీయోద్యమం కాలంలో మహాత్మా గాంధీ ఉద్యమం స్ఫూర్తితో తల్లి సూర్యకాంతమ్మ తన కుమారుడిని బాపూ అని పిలిచేదట. అదే స్థిరపడిపోయింది. నిజంగా, తెలుగు సినీ ప్రపంచానికి ఆయన బాపు.

0 comments:

Post a Comment

 
Top