Menu


హిందువుల పండుగలకు ఇంగ్లీష్ క్యాలెండర్ కు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఒక్క మకర సంక్రాంతి విషయంలో మాత్రం ఇంగ్లీష్ క్యాలెండర్ ను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది సంక్రాంతి పండుగ. పూర్తిగా గ్రహచలనాల పై ఆధారపడి వచ్చే పండుగ సంక్రాంతి కావడంతో ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ను అనుసరిస్తూ ఏ మాత్రం తేడా లేకుండా ఖచ్చితమైన తేదీలలో వస్తూ ఉంటుంది సంక్రాంతి పండుగ. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని మన నమ్మకం. నాస్తికులు కూడా సూర్యుడిలో ఉండే శక్తిని అంగీకరించి తీరుతారు. సూర్య గ్రహ గమనంతో సంబంధం ఏర్పరుచుకున్న సంక్రాంతి పెద్ద పండుగగా మారి భోగి, సంక్రాంతి, కనుమ అనే మూడు రోజుల పండుగగా తెలుగువారి ఇళ్ళల్లో సంక్రాంతి ముగ్గుల మధ్య అలంకరించిన చేమంతి, బంతి, గుమ్మడి పువ్వుల హడావిడితో ప్రతి తెలుగు వారి ఇల్లు కళకళలాడుతూ సందడిగా కనిపిస్తుంది.

 సంక్రాంతి పేరు వినగానే భోగిరోజునాడు వేసుకునే భోగిమంటలు గుర్తుకు వస్తాయి. ప్రతి ఇంటిలోని పనికిరాని వస్తువులను అలాగే ఊరిలోని చెత్తను పోగుచేసి భోగి మంటగా వేసుకునే ఆచారం కొన్ని శతాబ్దాలుగా మన తెలుగువారి ఆచార వ్యవహారాలలో కనిపిస్తుంది. భోగిమంటల సంస్కృతికి ప్రస్తుతం ఎందరో రాజకీయ వేత్తలు పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తున్న ‘స్వఛ్ భారత్’ కార్యక్రమానికి పోలికలు ఉన్నాయి. ఈరెండు విషయాలలోనూ మన ఇళ్లల్లోనే కాకుండా మన చుట్టు పక్కల ప్రాంతాలను పరిశుభ్రం చేసుకునే సాంప్రదాయం కనిపిస్తుంది. ఇక పురాణాలలోకి వెళితే మకర సంక్రమణానికి ముందురోజు బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడు అనే నమ్మకం ఉంది. పాతాళం నుండి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తిని ఆహ్వానించడానికి వేసే మoటలే ఈభోగి మంటలు. అంతేకాదు భూదేవి గోదాదేవిగా జన్మించి ధనుర్మాస వ్రతం ఆచరించి విష్ణువును పెళ్ళాడిన రోజుగా ఈభోగి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటాం.

మన హైందవ నమ్మకాలలో సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేసించే పుణ్య ఘడియలు సంక్రాంతి రోజు నుండి ప్రారంభం అవుతాయి. సంక్రాంతి రోజు విష్ణుసహస్రనామం జపించి చనిపోయిన మన పిత్రు దేవతలను స్మరించుకుంటూ దానాలు ఇస్తే మన పెద్దలకు మోక్షం కలుగుతుందని మన నమ్మకం. అదేవిధంగా సంక్రాంతి రోజున శివుడుని ఆవ్వు నెయ్యితో అభిషేకిస్తే సకల భోగాలు కలిగి మోక్షం కలుగుతుందని మరికొందరు పండితులు చెపుతూ ఉంటారు. ఇక మూడవనాడు వచ్చే కనుమ పండుగను మన తెలుగువారి పల్లెలలో పశువులు పండుగగా జరుపు కుంటారు. ఆరోజు వ్యవసాయ పనులు చేసే రైతులు తమ ఆవులు, ఎద్దులు, దున్నలను అలంకరించి పుజిస్తారు. ఆరోజు గ్రామీణ మహిళలు తొమ్మిది రకాల పిండివంటలతో నైవేద్యాలు పెట్టి అమ్మవారిని పుజిస్తారు. 

ఈ సంక్రాoతి మూడు రోజులలో ఎంత దానం చేస్తే అంత పుణ్యం అనే నమ్మకం ఉంది. సంక్రాంతి పండుగ అనగానే తెల్లవారుజామున వచ్చే హరిదాసులు, ఆడపిల్లలు అందంగా పెట్టుకునే గొబ్బెమ్మలు, మహిళలు ముచ్చటగా పెట్టుకునే బొమ్మలకొలువులు, పిల్లలకు మురిపంగా పోసే భోగిపళ్ళు, గాలిపటాల సందడి, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడి పందాలు ఇప్పటికీ కోస్తా ప్రాంతంలోని ప్రతి ఊరులోను కనిపిస్తూనే ఉంటాయి. కోడి పందాలకు సంబంధించి ఈ సంక్రాంతి మూడు రోజులలోనే కోస్తా జిల్లాలలో దాదాపు 1000 కోట్లు పందాల రూపంలో చేతులు మారిపోతాయి అని అంటే సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగానే కాకుండా ఎంత విలాసవంతంగా మన తెలుగు ప్రజలు జరుపుకుంటారో అర్ధం అవుతుంది. 

కుటుంబ సమేతంగా పెద్దలు పిల్ల్లలు కలిసి ఆనందాలను పంచుకుంటూ పూర్తి గ్రామీణ వాతావరణంలో జరుపుకునే తెలుగువారి అచ్చమైన తెలుగు పండుగ సంక్రాంతి. అంతేకాదు మహిళలలోని సృజనాత్మకతకు నిలువుటద్దంలా వారువేసే అందమైన ముగ్గులు గ్రామీణ మహిళల సృజనాత్మకత శక్తిని ఇప్పటికీ చాటుతున్నాయి. సంక్రాంతి ముందు వచ్చే ధాన్యలక్షితో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటే సంక్రాంతినాడు వచ్చే కొత్త అల్లుళ్ళ సందడితో ప్రతి ఇల్లు హడావిడిగా కనిపిస్తుంది.

 ఈ సంక్రాంతి మూడు రోజులు మహిళలు అంతా రకరకాల పిండివంటలు తయారు చేస్తూ ఉంటారు. బర్గర్లు, పిజ్జాలు తప్ప సాంప్రదాయ పిండివంటలను మరిచిపోయిన నేటి తరానికి సాంప్రదాయ రుచులను గుర్తుకు చేసే పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు సంస్కృతి ఉన్న ప్రతిచోటా సంక్రాంతి వేడుకలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఈ సంక్రాంతి సకల సౌభాగ్యాలను పాడిపంటలను కలుగచేసి తెలుగు సంస్కృతిని కాపాడుకునే శక్తి ఈ సంక్రాంతి అందరికీ కలుగ చేయాలని ఎపి హెరాల్డ్ తన పాఠకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది.


source:http://www.apherald.com/Movies/ViewArticle/76173/SANKRANTHI-SYMBOL-OF-INDIAN-TRADITION/

0 comments:

Post a Comment

 
Top